రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు..
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు..
రైతుల ఖాతాల్లో రూ.1,018 కోట్లు
పెద్దపల్లి జిల్లాలో 4.29 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ
ఆంధ్రప్రభ, పెద్దపల్లి రూరల్: 2025-26 రబీ సీజన్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, రికార్డు స్థాయిలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేసిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ఈ కొనుగోళ్లే నిదర్శనమన్నారు.
జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాల ద్వారా 4,29,921 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని, ఇందుకు గాను రైతుల ఖాతాల్లో నేరుగా రూ.1,018.65 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 29 వేల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే మార్కెట్ యార్డుల ద్వారా 25 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశామని చెప్పారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా, రంగు మారినా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని రైతుల వద్ద చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో రైతులు పండించిన ధాన్యాన్ని భద్రపరచేందుకు పెద్దపల్లి నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విజయరమణారావు తెలిపారు. లాలపల్లిలో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాము నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త గోదాముల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విపక్షాల విమర్శలను ఖండిస్తూ, రైతులకు మేలు చేసే కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్, ఐకేపీ మహిళా సంఘాలు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.
