ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలి
- మున్సిపల్ చైర్పర్సన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్
ధర్మపురి, ఆంధ్రప్రభ: ధర్మపురి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి కోరారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో స్థానిక జూనియర్ కాలేజీ ఆవరణలో ఈ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా భవన మరమ్మతుల నిమిత్తం రూ. 12 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను బుధవారం వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా దినేష్, నాగలక్ష్మి మాట్లాడుతూ ధర్మపురి ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కావడంతో పాటు స్థానికంగానే డిగ్రీ విద్య అందుబాటులోకి రావడం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల డిగ్రీ కళాశాల ప్రారంభం కావడం ఈ ప్రాంత విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. భవన పనులను వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, కౌన్సిలర్లు సంగి ఆనంద్, ఒజ్జల లక్ష్మణ్, జింజరికాని సువర్ణ, దొనకొండ నరేష్, పార్టీ నాయకులు రఫియోద్దీన్, తిరుపతి, సాగర్, శ్రీనివాస్, భరత్ పాల్గొన్నారు.
