వైభవోపేతంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

వైభవోపేతంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
పోటెత్తిన భక్తజనం.. 352 జంటల వ్రతాలు
భక్తులకు అన్నదాన ఏర్పాట్లు
దండేపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం అధిక జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తులంతా స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పవిత్ర పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 352 జంటలు ఒకేచోట కూర్చొని భక్తిశ్రద్ధలతో స్వామివారి వ్రతాలను ఆచరించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, చల్లని తాగునీటి వసతి కల్పించారు. అలాగే భక్తులకు సరిపడా లడ్డు, పులిహోర ప్రసాదాలను అందుబాటులో ఉంచి విక్రయించారు. స్వామివారి దర్శనానికి మరియు వ్రతాలకు వచ్చిన భక్తులందరికీ దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారని ఈవో శ్రీనివాస్ తెలిపారు.
