Tuni-Case | వారం రోజులైనా ఆచూకీ లేదు.. చిన్నారి కేసుపై పవన్ ఫోకస్ !!
Tuni-Case | వారం రోజులైనా ఆచూకీ లేదు.. చిన్నారి కేసుపై పవన్ ఫోకస్ !!
- ఎస్పీతో పవన్ సమీక్ష..
ఆంధ్రప్రభ: కాకినాడ జిల్లా తుని (Tuni-Case) మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి దర్యాప్తు పురోగతి, గాలింపు చర్యల వివరాలను తెలుసుకున్నారు.
చిన్నారి ఆచూకీ త్వరితగతిన గుర్తించేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను కూడా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. అలాగే దట్టమైన అటవీ ప్రాంతాల్లో గాలింపు కోసం అటవీ శాఖకు చెందిన నైట్ వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్లు సహకారం తీసుకుని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
దర్యాప్తు మరింత వేగవంతం చేయాలి
చిన్నారి కోసం ఇప్పటికే 400 మందికిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లు కాకినాడ ఎస్పీ పవన్ కళ్యాణ్‌కు వివరించారు. అత్యాధునిక డ్రోన్ల సహాయంతో ప్రాంతాన్ని అణువణువూ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే చిన్నారి నివాసం పరిసరాల్లో ఉన్న 38 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినట్లు వెల్లడించారు.
చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడిచిన నేపథ్యంలో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసి, అన్ని కోణాల్లో విచారణ కొనసాగించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిన్నారి ఆచూకీ త్వరగా కనుగొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
