Stand-Up Comedy | స్టాండప్ కామెడీకి బౌండరీలు ఎక్కడ?
Stand-Up Comedy | స్టాండప్ కామెడీకి బౌండరీలు ఎక్కడ?
- వైరల్ అవ్వడానికి హద్దులు దాటుతున్న కమెడియన్లు
- స్టాండప్ కామెడీ పేరుతో పెరుగుతున్న కాంట్రవర్సీలు
ఆంధ్రప్రభ: ఒకప్పుడు సామాజిక అంశాలపై వ్యంగ్యంగా స్పందిస్తూ నవ్వులు పండించిన స్టాండప్ కామెడీ (Stand-Up Comedy)… ఇప్పుడు తరచూ కాంట్రవర్సీలకు కేంద్రంగా మారుతోంది. క్రియేటివిటీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో కొందరు కమెడియన్లు అసభ్యకర కామెంట్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, నిర్దిష్ట వర్గాలను టార్గెట్ చేసే జోకులతో విమర్శలు ఎదుర్కొంటున్నారు.
హాస్యానికి, హేళనకు మధ్య చాలా సన్నని లైన్ ఉంటుంది. ఆ లైన్‌ను గుర్తించడంలో కొందరు స్టాండప్ కమెడియన్లు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నవ్వించాలనే ఉద్దేశంతో చెప్పే జోక్స్ కొన్నిసార్లు వ్యక్తులు, వర్గాలు లేదా సమాజంలోని సెంటిమెంట్లను దెబ్బతీసేలా మారుతున్నాయి. అలాంటి సందర్భాల్లో అవి హాస్యంగా కాకుండా వివాదాలకు కారణమవుతున్నాయి.
“రూ.370 బిర్యానీ” వివాదం..
ఇటీవల మహారాష్ట్రకు చెందిన స్టాండప్ కమెడియన్ (Stand-Up Comedy) ప్రణీత్ మోర్ చుట్టూ చెలరేగిన “రూ.370 బిర్యానీ” వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని కేఈఎం ఆస్పత్రికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని సేజల్ పవార్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదానికి దారితీశాయి. మెడికల్ విద్యలో ఉపయోగించే మృతదేహాలు (Cadavers) గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను వైద్య వర్గాలు కూడా తీవ్రంగా విమర్శించింది. మెడికల్ విద్యార్థుల శిక్షణ కోసం తమ శరీరాలను దానం చేసే వారిని గౌరవించాలని, వారికి కృతజ్ఞత చూపాలని విశ్వసించే ఆ సమాజం, ఆ వ్యాఖ్యలను అనుచితమైనవిగా అభివర్ణించింది. సోషల్ మీడియాలో కూడా ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

కేఈఎం ఆస్పత్రి చర్యలు..
వివాదం ముదరడంతో కేఈఎం ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. విద్యార్థిని చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవి అని పేర్కొంటూ, ఆమెను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. ఆస్పత్రి ఏర్పాటు చేసిన వాస్తవ నిర్ధారణ కమిటీ నివేదిక అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీన్ డాక్టర్ హరీష్ ఎం. పాఠక్ తెలిపారు. తుది నిర్ణయం కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఘటనపై పూర్తి స్థాయి విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇదే షోలో జరిగిన మరో సంభాషణ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఓ ప్రేక్షకుడు చెప్పిన “రూ.370 బిర్యానీ” కథలో మహిళల సమ్మతి (Consent) అంశాన్ని తేలికగా తీసుకునేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వ్యాఖ్యలను కమెడియన్ ప్రణీత్ మోర్ ప్రశ్నించకుండా.. నవ్వుతూ మరింత లైట్ తీసుకోవడం ఆ వివాదాన్ని మరింత పెంచింది. వీడియో వైరల్ కావడంతో మహిళా హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం మహారాష్ట్ర సైబర్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

ఈ రెండు ఘటనల తర్వాత స్టాండప్ కామెడీలో వ్యక్తిగత స్వేచ్ఛ, హాస్యం, సామాజిక బాధ్యతల మధ్య గీత ఎక్కడ గీయాలనే దానిపై ఒక చర్చ మొదలైంది. కామెడీ పేరుతో సున్నితమైన అంశాలను ప్రస్తావించేటప్పుడు బాధ్యత అవసరమా? లేక అది పూర్తిగా భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనా? ఈ అంశంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.
ఇదే మొదటిసారి కాదు..
స్టాండప్ కామెడీ పేరుతో వివాదాలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా నిర్వహించిన షోలు, ఆన్లైన్ కార్యక్రమాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. అలాగే పలువురు స్టాండప్ కమెడియన్లు మతం, రాజకీయాలు, మహిళలు, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాఖ్యల కారణంగా కోర్టు కేసులు, పోలీసు విచారణలు, సోషల్ మీడియా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.

ఈ ఘటనలతో.. స్టాండప్ కామెడీ అనేది స్వేచ్ఛాయుత కళారూపమే అయినప్పటికీ, సమాజంలో సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు బాధ్యత కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయం బలపడుతోంది. నవ్వులు పంచే ప్రయత్నంలో వ్యక్తుల గౌరవం, మహిళల భద్రత, మృతుల పట్ల గౌరవం వంటి విలువలు దెబ్బతినకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైరల్ అవ్వడానికి వల్గర్ కంటెంట్ !
సోషల్ మీడియా యుగంలో వైరల్ అవ్వడం చాలా మందికి ప్రధాన లక్ష్యంగా మారింది. ఎక్కువ వ్యూవ్స్, రీచ్, ట్రెండింగ్ కోసం కొందరు సంచలన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యలే తర్వాత లీగల్ ట్రబుల్స్, సోషల్ మీడియా ట్రోలింగ్, ప్రజా వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. గతంలో ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా కూడా తన షో కారణంగా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు స్టాండప్ కామెడీలో హద్దులపై మరోసారి చర్చకు దారితీశాయి.
తెలుగులోనూ పెరుగుతున్న చర్చ
తెలుగు స్టాండప్ వేదికలపై కూడా ఇటీవల అడల్ట్ హ్యూమర్, వ్యక్తిగత అనుభవాల పేరుతో అసభ్య పదజాలం వినియోగంపై చర్చ జరుగుతోంది. సెక్స్ ఎడ్యుకేషన్, మహిళా సాధికారత వంటి అంశాలపై అవగాహన కల్పించడం అవసరమే అయినప్పటికీ, వాటిని ప్రజా వేదికలపై ఎలా ప్రదర్శించాలనే అంశం కూడా అంతే ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టాండప్ కామెడీ ఒక గొప్ప ఆర్ట్ ఫామ్. కానీ దానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తోడై ఉండాలి. వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కోర్టు కేసులు, సోషల్ మీడియా బ్యాక్లాష్, కెరీర్‌కు నష్టం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. నవ్వులు పంచే కళగా ఉన్న స్టాండప్ కామెడీ.. అసభ్యత, వ్యక్తిగత దూషణలు, హేట్ స్పీచ్ వైపు వెళ్లకుండా ఉంటేనే తన అసలైన విలువను నిలబెట్టుకోగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హాస్యానికి హద్దులేవి..?
ఈ కాలంలో స్టాండప్ కామెడీ అనేది కేవలం నవ్వించే వేదిక మాత్రమే కాదు… సమాజాన్ని ఆలోచింపజేసే ఒక పవర్ఫుల్ ఆర్ట్ ఫామ్ కూడా. మంచి కామెడీ మనసును తేలికపరచడమే కాదు, సమాజంలోని కొన్ని సోషల్ ఇష్యూస్ పై మనల్ని కొత్త యాంగిల్లో ఆలోచించేలా చేస్తుంది. కానీ, అదే హాస్యం పేరుతో మహిళల గౌరవం, పర్సనల్ వాల్యూస్ లేదా సెన్సిటివ్ టాపిక్స్ ని తక్కువ చేసి చూపిస్తే… ఖచ్చితంగా పెద్ద వివాదాలకు అవి దారి తీస్తాయని రీసెంట్ ఇన్సిడెంట్స్ మనకు చూపిస్తున్నాయి.
ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో, ఒక చిన్న కామెంట్ క్షణాల్లో లక్షల మందికి రీచ్ అవుతోంది. అందుకే కమెడియన్లు స్టేజ్ మీద మాట్లాడే ప్రతి మాటకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అవసరం. కేవలం వైరల్ అవ్వడం కోసమో, వ్యూస్ కోసమో హద్దులు దాటి జోక్స్ వేస్తే… స్టేజ్ మీది నుండి డైరెక్ట్‌గా జైలు పాలయ్యే ఛాన్స్ కూడా ఉంది.
కామెడీ అనేది ఎప్పుడూ నవ్వులు పంచాలి, ఆలోచింపజేసేదిగా ఉండాలి. కానీ ఎవరి మనోభావాలనూ, గౌరవాన్నీ దెబ్బతీయకూడదు. అదే నిజమైన కామెడీకి, ఒక గుడ్ ఆర్టిస్ట్‌కి ఉండాల్సిన అసలైన క్వాలిటీ!
Jetson One | ట్రాఫిక్ జామ్‌కు సొల్యూషన్ వచ్చేసింది..
Stand-Up Comedy Stand-Up Comedy Stand-Up Comedy Stand-Up Comedy
