శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను ప్రభావంతో నిన్ని రాత్రి నల్లమల అటవీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడి రహదారి మధ్యలో పడ్డాయి. దీన్ని ఫలితంగా హైదరాబాద్–శ్రీశైలం మధ్య రహదారి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి ప్రమాద ప్రాంతాన్ని మూసివేశారు. రహదారిపై పడిన రాళ్లను తొలగించేందుకు జేసీబీల సాయంతో క్లియరెన్స్ పనులు వేగంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

లింగాలగట్టు చెక్‌పోస్ట్ సమీపంలో వాగు ఉప్పొంగి ప్రవహించడం వల్ల చెక్‌పోస్ట్ భవనం పాక్షికంగా కోతకు గురైనట్టు సమాచారం. వర్షపాతం తీవ్రత దృష్ట్యా శ్రీశైలం దిశగా ప్రయాణించే భక్తులు, పర్యాటకులు అత్యవసర పరిస్థితులు మినహా రాకపోకలు నిలిపివేయాలని పోలీసులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు స్థిరపడే వరకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
