Parlament | అందులో రాజీపడబోం…

Parlament | అందులో రాజీపడబోం…

Parlament | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలకంగా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ, డీలిమిటేషన్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలుపుతారని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్‌కు అనుకూలంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

అయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఎలాంటి ప్రతిపాదనలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24శాతం సీట్ల వాటా తగ్గకూడదని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

బిల్లులోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభ, ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు.

Leave a Reply