12thJune2026 | తిరుమలలో భక్తుల రద్దీ
12thJune2026 | తిరుమలలో భక్తుల రద్దీ
12thJune2026 | ఓం నమో వేంకటేశాయ
సర్వదర్శనానికి 18 గంటల నిరీక్షణ
ఒక్కరోజులో 75 వేల మందికి పైగా శ్రీవారి దర్శనం
హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు..
12thJune2026 | ఆంధ్రప్రభ, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. వారాంతం కావడంతో పాటు శనివారం శ్రీవారిని దర్శించుకోవడం శుభప్రదమనే విశ్వాసంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో క్యూలైన్లు మరింత పొడవుగా మారాయి.
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్లు ఆక్టోపస్ భవనం దాటి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు విస్తరించాయి. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వచ్చే భక్తులు సుమారు 18 నుంచి 24 గంటల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు కూడా 3 నుంచి 6 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
శుక్రవారం నుంచి సోమవారం వరకు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. రద్దీ దృష్ట్యా సొంత వాహనాల కంటే ప్రజా రవాణా సేవలను ఎక్కువగా వినియోగించాలని, పార్కింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని భక్తులకు సూచించారు.
ఇదిలా ఉండగా, జూన్ 11న మొత్తం 75,428 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 42,566 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు నమోదు కాగా, 4.34 లక్షల లడ్డూలు విక్రయమయ్యాయి. అలాగే 2.98 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.
భక్తులకు అందిస్తున్న సేవల్లో భాగంగా తిరుమలలోని వైద్య విభాగం ద్వారా 4,122 మందికి చికిత్స అందించినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనం, వసతి, అన్నప్రసాదం, వైద్య సేవలు, భద్రత తదితర విభాగాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
టీటీడీ సమాచారం ప్రకారం, ఎస్‌ఎస్‌డీ (స్లాటెడ్ సర్వదర్శనం) టోకెన్లు లేని భక్తులకు ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. భక్తులు రద్దీ పరిస్థితులను ముందుగానే తెలుసుకుని తమ యాత్రను ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
