వైభవంగా అడవి పేరంటాళ్లమ్మ తిరునాళ్ల

వైభవంగా అడవి పేరంటాళ్లమ్మ తిరునాళ్ల

శావల్యాపురం, ఆంధ్రప్రభ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శానంపూడి శివారులో ఉన్న బొందిలిపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ అడవి పేరంటాళ్ళమ్మ తల్లి తిరునాళ్ళ వేడుకులను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో మహిళలు పొంగళ్ళు పొంగించి, అమ్మవారికి నూతన వస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమతో తమ మొక్కులను చెల్లించుకున్నారు. అమ్మవారి మూల విరాట్ కి వెండితోడుగు, పూలదండలు, పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి విశేష పూజలను వేదపండితులు నిర్వహించారు.

దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాదయ శాఖా అధికారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. దేవాలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు తెల్లవారు జాము నుంచే క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

వినుకొండ రూరల్ సీఐ బొప్పన బ్రహ్మయ్య పర్యవేక్షణలో స్థానిక ఎస్ఐ వెంకటేష్ బాబు అనేక మంది పోలీసు సిబ్బందితో తిరునాళ్ళలో శాంతి భద్రతలు పర్యవేక్షణ చేశారు. మండలంలోని బొందిలిపాలెం, మతుకుమల్లి, పిచికలపాలెం గ్రామాల వారు ఏడు విద్యుత్ ప్రభలను నిర్మించారు. రాత్రి వేల ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కృషి చేశారు.