మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్‌ఐ సతీష్
నకరికల్లు, ఆంధ్రప్రభ: నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సత్తెనపల్లి డీఎస్పీ పర్యవేక్షణలో, సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూచనలతో నకరికల్లు ఎస్‌ఐ సతీష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్‌ఐ సతీష్ మాట్లాడుతూ మహిళలు తమ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, ఓటీపీలు పంచుకోవద్దని తెలిపారు. సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని, సైబర్ వేధింపులు లేదా మోసాలకు గురైన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
మహిళలపై జరిగే వేధింపులు, గృహ హింస, ఈవ్‌టీజింగ్, వెంటాడటం వంటి చర్యలు చట్టరీత్యా నేరాలని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా సహాయ కేంద్రం 181, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్లకు ఫోన్ చేయాలని అవగాహన కల్పించారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువతులు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గుండ్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు.
