వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..

వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..

మహిళల ఆగ్రహం, తరుణ్ కొఠారి అరెస్ట్

బిల్లులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడంటూ ఆరోపణలు..

బ్లాక్‌మెయిల్ ఫిర్యాదుల వెల్లువ

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తరుణ్ కొఠారి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించడంతో కొంతసేపు పరిసర ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని మహిళలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం తరుణ్ కొఠారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

బాధిత మహిళల ఆరోపణల ప్రకారం, విజయవాడ మున్సిపల్ సంస్థలో కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పిస్తానని నమ్మించి తరుణ్ కొఠారి డబ్బులు తీసుకున్నాడని పేర్కొన్నారు. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ పనులు చేయించకపోగా, తమను బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్ వద్ద కూడా తరుణ్ కొఠారి అసభ్య పదజాలంతో ప్రవర్తించాడని ఆరోపిస్తూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవల కాలంలో పలువురు వ్యాపారులను సైతం అతను బ్లాక్‌మెయిల్ చేశాడనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply