ఓటు ప్రజాస్వామ్య విలువలకు పునాది

పాయకాపురం, ఆంధ్ర ప్రభ: స్వచ్ఛమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాదని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేట బూత్ నెంబర్.4 నందు నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓలు చేపడుతున్న ఇంటింటి ఓటరు వివరాల సేకరణ, ధృవీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని అన్నారు. పేర్లు, చిరునామాలు, ఇతర వ్యక్తిగత వివరాలలో మార్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి వివరాలను బీఎల్‌ఓలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కబీర్, ఎరుబోతు కనకారావు, కంచేటి నాగరాజు, డిడి నాయుడు, దేవర తదితరులు పాల్గొన్నారు.