అంగరంగ వైభవం.. సీతారాముల కళ్యాణం

అంగరంగ వైభవం.. సీతారాముల కళ్యాణం

  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండువగా శ్రీరామనవమి
  • సీతారాముల కోసం సుమారు రూ.2.50 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాల సమర్పణ
  • 2 కిలోల 250 గ్రాముల బంగారంతో స్వర్ణాభరణాలు
  • 10కిలోల వెండితో ఆదిశేషుడు, వెండి కళ్యాణ పీట
    భారీ సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవాన్ని

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్ రామ్ మందిరంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రంగపేట పీఠాధిపతులు పూజ్య శ్రీ మాదవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో, జ్యోతిర్వాస్తు విద్యా పీఠం పీఠాధిపతి శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి, ఆయన మిత్రులు, రామ్ మందిర్ యువసేన, ఆలయ కమిటీ పెద్దల సహకారంతో సీతారాముల కోసం సుమారు రూ.2.50 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను సమర్పించారు.

ఇందులో సుమారు 2 కిలోల 250 గ్రాముల బంగారంతో తయారు చేసిన కిరీటాలు, కర్ణాభరణాలు, కంటాభరణాలు, వడ్డానాలు, పద్మపాదాలు, ధనస్సు, బాణం, యజ్ఞోపవీతం, నయనాలు, తిలకాలు, ముక్కుపోగు, శంకు-చక్రాలు, అమ్మవారికి మంగళసూత్రం, కమలహస్తం, శ్రీరాముల వారికి శరంతో కూడిన హస్తం వంటి విశేష ఆభరణాలు ఉన్నాయి. అదనంగా 10 కిలోల వెండితో ఆదిశేషుడు, వెండి కల్యాణ పీటను తయారు చేసి సమర్పించారు.
జగ్గారెడ్డి ఇంటి నుంచి ఆభరణాల ఊరేగింపు
రామ్‌నగర్‌లోని జగ్గారెడ్డి నివాసంలో ముందుగా ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వాటిని ఘనంగా ఊరేగింపుగా రామ్ మందిరానికి తీసుకువచ్చారు. ఊరేగింపు అనంతరం సీతారాముల వారికి బంగారు ఆభరణాలను సమర్పించి, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక నాయకులు, యువసేన సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవాన్ని వీక్షించారు.