ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి..

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ (డీఆర్ఓ) పాండు‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్‌వీ నాయకుడు అఖిల్ మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యంగా విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం, బాలురు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించాలని కోరారు. అదేవిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల కుదింపు ప్రక్రియను నిలిపివేసి విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సభ్యులు రఘు, సాయి తదితరులు పాల్గొన్నారు.