అప్పుల భారం.. దంపతుల మృతి

అప్పుల భారం.. దంపతుల మృతి
ఆవిరిపూడి గ్రామంలో విషాదం
మొవ్వ, ఆంధ్రప్రభ: అప్పుల భారం, కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మొవ్వ మండలంలోని ఆవిరిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. కూచిపూడి ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఆవిరిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి పాండురంగారావు (60), రేణుకమ్మ (55) దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఉన్న అప్పుల కారణంగా కొంతకాలంగా కుటుంబంలో విభేదాలు నెలకొన్నట్లు సమాచారం.
డ్వాక్రా రుణాలు, ఇతర అప్పుల చెల్లింపుల విషయంలో శనివారం మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన కుమారుడు వారిని వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ రేణుకమ్మ ఆదివారం ఉదయం మృతి చెందగా, పాండురంగారావు అదే రోజు సాయంత్రం కన్నుమూశారు. మృతి చెందిన దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
