వైసీపీ పాలనలో పెరిగిన నిరుద్యోగం..
వైసీపీ పాలనలో పెరిగిన నిరుద్యోగం..
- ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ
విజయవాడ, ఆంధ్రప్రభ : యువతను మోసం చేసిన పాలనకు… యువతకు భవిష్యత్ ఇచ్చే పాలనకు తేడా స్పష్టంగా కనబడుతోందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ శుక్రవారం నాడు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువతను మోసం చేయగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యువతకు నమ్మకాన్ని, భరోసాను కల్పిస్తోందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు, ఉగాది సందర్భంగా మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం యువతకు శుభవార్త అని అన్నారు.
కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, పరిశ్రమల ద్వారా కూటమి ప్రభుత్వం గత 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను కల్పించడం గొప్ప విజయమని తెలిపారు. ఇది యువతపై ఉన్న నిజమైన నిబద్ధతకు నిదర్శనమన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాల సృష్టికి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అడుగు అని గద్దె అనురాధ పేర్కొన్నారు. దావోస్ పర్యటనల ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
“జాబ్ క్యాలెండర్ అంటే కేవలం పేపర్ ప్రకటన కాదు… ఇది నిరుద్యోగ యువతకు ఇచ్చిన గ్యారెంటీ” అని ఆమె స్పష్టం చేశారు. విద్య, పోలీస్ శాఖల్లో భారీ నోటిఫికేషన్లు విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. 2019 ఎన్నికల ముందు 2.30 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అంటూ హామీలు ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
ఆయన పాలనలో పరిశ్రమలు రాకపోగా, ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రాన్ని విడిచిపెట్టడంతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారని విమర్శించారు. వైసీపీ హయాంలో నిరుద్యోగం పెరిగి, యువత నిరాశలోకి నెట్టబడిందన్నారు. ఒక వైపు యువతకు భవిష్యత్ చూపిస్తున్న చంద్రబాబు-లోకేష్ నాయకత్వం… మరోవైపు భవిష్యత్‌ను చీకటిలోకి నెట్టిన జగన్ పాలన మధ్య తేడాను యువత స్పష్టంగా గ్రహించిందని గద్దె అనురాధ తెలిపారు. యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు, పారదర్శక పాలన—ఇవే కూటమి ప్రభుత్వ లక్ష్యాలని, అదే నిజమైన అభివృద్ధి రాజకీయమని ఆమె స్పష్టం చేశారు.
