అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత ఆపాలి…
అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత ఆపాలి…
ప్రజల అనుమతి లేకుండా ప్రాజెక్టులు అమలు చేయొద్దు..
కార్పొరేట్ ప్రయోజనాల కోసం ప్రకృతిని బలి చేయొద్దు.
నికోబార్ అంశంపై చంద్రబాబు స్పందించాలి
కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు ఇన్చార్జి వల్లూరు భార్గవ్..
విజయవాడ, ఆంధ్రప్రభ : అభివృద్ధి పేరుతో అడవులను ధ్వంసం చేయడం వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌చార్జ్ భర్గవ్ వల్లూరు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేట్ నీకోబర్ ఇస్లాండ్ లో ప్రతిపాదిత మౌలిక వసతుల ప్రాజెక్టుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల గ్రేట్ నికోబార్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారని పేర్కొన్నారు.
సుమారు రూ.92,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్టులో పోర్ట్, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం లక్షలాది చెట్ల తొలగింపు జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు చుట్టూ పర్యావరణ, స్థానిక గిరిజన సముదాయాల హక్కులు, ప్రజా సంప్రదింపుల అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందన్నారు. ప్రాజెక్టు వ్యూహాత్మకంగా అవసరమని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా, పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజల ఆందోళనలను విస్మరించరాదని విమర్శకులు అంటున్నారని తాజా నివేదికలు సూచిస్తున్నాయని, అభివృద్ధి అనేది ప్రజల అంగీకారం, పర్యావరణ సమతౌల్యం, భవిష్యత్ తరాల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలన్నారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే ప్రజల జీవితాలపై కనిపిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, అడవులు, జీవ వైవిధ్యం, స్థానిక సముదాయాల హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని భర్గవ్ వల్లూరు కోరారు. అభివృద్ధి అంటే ప్రకృతి విధ్వంసం కాదని, ప్రజల భాగస్వామ్యంతో జరిగే సుస్థిర ప్రగతే నిజమైన అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు.
