డీజిల్‌, పెట్రోల్‌ కొరత..

డీజిల్‌, పెట్రోల్‌ కొరత..

అల్లాడిపోతున్న ప్రజలు
నిలిచిన వ్యవసాయ పనులు
లబోదిబోమంటున్న రైతులు

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావం ప్రతి ఒక్కరికీ పడుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆయిల్‌ నిల్వలు లేక పోవడంతో పెట్రోల్‌ బంకులు రోజులో కొంత సేపు మాత్రమే అమ్మకాలు జరిపి నోస్టాక్‌ బోర్డును పెడుతున్నారు. ఇక రాత్రి వేళల్లో పూర్తిగా మూసివేస్తున్నారు. మూడు రోజులుగా నందికొట్కూరులో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని పెట్రోల్‌ బంకుల యజమానులు అత్యవసర సేవలకు వినియోగించే వాహనాల కోసం కొంత స్టాక్‌ను నిలువ చేసుకొని వారికి మాత్రమే వేస్తున్నారు. దీంతో అంబులెన్స్‌, పోలీసు వాహనాలకు, ఎంతో మేలు జరుగుతుంది. వాహనాల్లో పెట్రోల్‌, డీజిల్‌ నింపుకునేందుకు ప్రజలు బారులు దీరుతున్నారు.

వ్యవసాయ పనులకు..

ప్రసుత్తం వ్యసాయపనులు చేసుకునే సమయం కావడంతో ట్రాక్టర్‌లో ఇంధనం నింపుకునేందుకు పాట్లు పడుతున్నారు. డీజిల్‌ లేక పోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నందికొట్కూరు నియోజకవర్గం పరిదిలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో దాదాపు లక్షల ఎకరాల్లో పంట సాగు కావాల్సి ఉంది. మూడు రోజులుగా డీజిల్‌ కొరతతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పంటలు సాగు చేసుకునేందుకు ఇబ్బందిగా మారింది.

రోజులు మారితే పంట అదును తప్పుతుందని పంట దిగుబడి పై ఈ ప్రభావం ఉంటుందని రైతులు తెలుపుతున్నారు. మరి కొంత మంది బోర్లు వేయించే వారికి కూడా బోరుబండ్లకు చాలా మంది డీజిల్‌ వ్యాపారులు డీజిల్‌ వేయడం లేదు. ఒక బోరు బండికి వేసే డీజిల్‌ పది ట్రాక్టర్లకు వేయవచ్చునని తెలుపుతున్నారు. మరి కొన్ని రోజులు స్టాక్‌ రాకపోవచ్చునని పెట్రో వ్యాపారులు తెలుపుతున్నారు.

బ్లాక్‌ దందాకు తెర..

పెట్రోల్‌, డీజిల్‌ రావడం లేదన్న సాకుతో నందికొట్కూరులో కొంతమంది పెట్రోల్‌, డీజిల్‌ బ్లాక్‌ దందాకు తెరలేపారు. పెట్రోల్‌ బంకుల యజమా నులు కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా వారి ఏ మాత్రం మార్పు రావడంలేదు. తమకు తెలిసిన వారికి మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ విక్రయిస్తూ తమ దగ్గర పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉందని నోస్టాక్‌ బోర్డులు పెడుతున్నారు.

వాస్తవానికి పెట్రోల్‌ లీటరు రూ.109. 36, డీజిల్‌ రూ.97.24 అమ్మాల్సి ఉంది. కొంతమంది పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే సిబ్బందితో పల్లెల్లో పెట్రోల్‌ రూ.140 నుంచి రూ.170 వరకు, డీజిల్‌ రూ.150 నుంచి రూ.160 వరకు విక్రయిస్తూ వినియోగదారులను నిలువు దోపీడీ చేస్తున్నారు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగ దారులు పెట్రోల్‌ బంకుల యాజమాన్యం, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నందికొట్కూరు పట్టణంలో 7 పెట్రోల్‌ బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. హైవే రహదారిలోని పెట్రోల్‌ బంకులల్లో కూడా పెట్రోల్‌ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

అధిక ధరలకు విక్రయిస్తున్నారు…

నందికొట్కూరులో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పట్టణంలో పెట్రోల్‌, డీజిల్‌ వేయించుకోవాలని వెళ్లినా అక్కడి బంకుల యాజమాన్యం డీజిల్‌, పెట్రోల్‌ లేదని చెబుతున్నారు. దీంతో ఇబ్బందులు తప్పడంలేదు. – టి రమేష్

Leave a Reply