నాటు సారాయి నిర్మూలనపై ఉక్కుపాదం

నాటు సారాయి నిర్మూలనపై ఉక్కుపాదం

– పీడీ చట్టం కింద మరో బూట్‌లెగ్గర్ నిర్బంధం

కర్నూలు బ్యూరో ఆంధ్రప్రభ : జిల్లాలో నాటు సారాయి నిర్మూలనకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా అక్రమ నాటు సారాయి తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో బూట్‌లెగ్గర్‌పై పీడీ చట్టం ప్రయోగించారు.

ఆదోని పట్టణంలో నాటు సారాయి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బోయ మురళి అనే వ్యక్తిని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద నిర్బంధించి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

గతంలో సాతుపాటి కృష్ణ, తెలుగు రామదాసు అనే ఇద్దరు నాటు సారాయి నేరస్థులపై కూడా పీడీ చట్టం అమలు చేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. తాజా కేసులో నిర్బంధితుడైన బోయ మురళి 2020 కరోనా కాలం నుంచి ఎక్సైజ్ శాఖ, ప్రత్యేక అమలు విభాగం, పోలీసు శాఖలు నమోదు చేసిన దాదాపు 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత 24 నెలల్లోనే తొమ్మిది కేసుల్లో పట్టుబడటం అతని నేరచరిత్ర తీవ్రతను సూచిస్తుందని పేర్కొన్నారు.

నాటు సారాయి అక్రమ తయారీ, రవాణాకు పాల్పడుతున్న వారు వెంటనే ఈ కార్యకలాపాలకు స్వస్తి పలకాలని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు, డీఆర్‌డీఏ, మెప్మా వంటి సంస్థల సహకారంతో ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను ఎంచుకుని గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించింది.

ఈ కేసులో పీడీ చట్టం అమలు చేసి నిందితుడిని కడప కేంద్ర కారాగారానికి తరలించడంలో ఆదోని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సైదులు, ఈఎస్టీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం. సుధీర్ బాబు వెల్లడించారు.

Leave a Reply