కొమ్మిరెడ్డిపల్లి ‘రోడ్డు’ కష్టాలకు మోక్షం..

కొమ్మిరెడ్డిపల్లి ‘రోడ్డు’ కష్టాలకు మోక్షం..

ఎమ్మెల్యే కొలికపూడి చొరవతో నెరవేరిన దశాబ్దాల కల!
అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించిన కాలం ఇక గతం
గత పాలకుల వైఫల్యాన్ని ఎండగట్టిన గ్రామస్తులు
మాట ఇచ్చారు.. నిధులు తెచ్చారు : ప్రజా నాయకుడికి నీరాజనాలు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ : ఎమ్మెల్యే కొలికపూడి!
అప్పుడు నిర్లక్ష్యం.. ఇప్పుడు అభివృద్ధి.
కొమ్మిరెడ్డిపల్లి మార్గంలో మారిన గ్రామ రాత!
తిరువూరు నియోజకవర్గ సమస్యల పరిష్కర్త.. కొలికపూడి శ్రీనివాసరావు!
మాట తప్పని నాయకుడు.. మడమ తిప్పని హామీ కొమ్మిరెడ్డిపల్లిలో పండుగ సంబరం!

తిరువూరు, ఆంధ్రప్రభ : కొన్ని ఏళ్ల తరబడి ఆ గ్రామ ప్రజల కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన శుభ ఘడియలు రానే వచ్చాయి. మట్టి రోడ్డు మీద ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని, ఏటా వర్షాకాలంలో కన్నీరుమున్నీరయ్యే కొమ్మిరెడ్డిపల్లి గ్రామస్తుల కష్టాలకు శాశ్వత విముక్తి లభించింది. తిరువూరు శాసనసభ్యులు గౌరవనీయులు కొలికపూడి శ్రీనివాసరావు గారు చూపిన ప్రత్యేక చొరవతో, దశాబ్దాల నాటి రోడ్డు సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయడంతో గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

దశాబ్దాల నిర్లక్ష్యం.. ముగిసిన నిరీక్షణ…

గత ప్రభుత్వాల హయాంలో కొమ్మిరెడ్డిపల్లి అభివృద్ధి అన్న మాటే వినిపించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం శూన్యం. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చి వాగ్దానాలు కురిపించడం, గెలిచిన తర్వాత కన్నెత్తి చూడకపోవడం గత పాలకులకు రివాజుగా మారిందని గ్రామ పెద్దలు మండిపడుతున్నారు. కనీసం అత్యవసర సమయంలో గ్రామంలోకి అంబులెన్స్ కూడా రాలేని దుస్థితిలో, అనారోగ్యంతో ఉన్న వారిని మంచాలపై మోసుకుంటూ ప్రధాన రహదారి వరకు తీసుకెళ్లిన చేదు జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు.

మాట ఇచ్చారు.. మార్పు తెచ్చారు!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కొలికపూడి శ్రీనివాసరావు గారిని కొమ్మిరెడ్డిపల్లి ప్రజలు కలిసి తమ సమస్యను వివరించారు. ప్రజల గోడును స్వయంగా విన్న ఆయన, తక్షణమే రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మరచిపోయే తత్వం కాదని నిరూపిస్తూ, బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ప్రత్యేక నిధుల మంజూరుకు కృషి చేశారు. పనుల ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయడంతో గ్రామస్తుల్లో ఆశలు చిగురించాయి.

ప్రజల నాయకుడు.. కొలికపూడి!

“ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తీర్చే వాడే అసలైన నాయకుడు” అంటూ కొమ్మిరెడ్డిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే గారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని సమస్యను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్న తీరు చూసి వారు ఫిదా అవుతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తున్న ఏకైక నాయకుడు కొలికపూడి అంటూ వారు నీరాజనాలు పలుకుతున్నారు. తమ గ్రామానికి కొత్త కళ రాబోతుండటంతో కొమ్మిరెడ్డిపల్లిలో నేడు పండుగ వాతావరణం నెలకొంది.