ఉరుకొండ పేటలో ముమ్మరంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు

ఊరుకొండ, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఊరుకొండ మండల పరిధిలోని ఉరుకొండ పేట గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులను గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు.
గ్రామ ప్రజల సౌకర్యార్థం, పరిశుభ్రత పరిరక్షణతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు 4, 5, 7వ వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
