New-Birth-Death : ఆదమరిస్తే..అంతే,, Andhra Prabha Spl Story
New-Birth-Death : ఆదమరిస్తే..అంతే,, Andhra Prabha Spl Story
- తప్పదు మూల్యం
- జనన మరణ నమోదు ఆలస్యం ప్రమాదం
- నయా చట్టం రెడీ
- .కొత్త చట్టం మహా కష్టం
- .జాన్యం చేస్తే వ్యయప్రయాసే
- .నకిలీలకు చెక్
- అమ్మానాన్న జర భద్రం

(కడప బ్యూరో , ఆంధ్రప్రభ)
జనన,మరణ ధ్రువీకరణ పత్రాల నమోదులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఆలస్యపు నమోదులకు ఇక కోర్టు గడప ఎక్కక తప్పదు. ప్రస్తుతం కడప జిల్లాలో ఆసుపత్రి సర్టిఫికెట్ ఆధారంగా సచివాలయాల ద్వారా సులభంగా బర్త్ సర్టిఫికెట్లు పొందడంతో పాటు రెవెన్యూ అధికారుల అనుమతితో పేర్లు, పుట్టిన తేదీల్లో సవరణలు చేసుకునే అవకాశం ఉంది. అయితే లోక్‌సభ ఆమోదించిన రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (సవరణ) బిల్లు–2026 చట్టంగా మారితే రెండేళ్లు దాటిన తర్వాత జనన , మరణ నమోదులు, కీలక మార్పులకు కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనుమతి తప్పనిసరి కానుంది. దీంతో ఆలస్యం చేసిన వారికి కోర్టు ప్రక్రియ, అదనపు పత్రాలు, న్యాయవాదుల ఫీజులు, సమయ వ్యయం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే తల్లిదండ్రులు జనన, మరణ నమోదులు, అవసరమైన సవరణలు రెండేళ్లలోపే పూర్తి చేసుకోవడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.
జననం, మరణ ధ్రువీకరణ పత్రాల నమోదులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆలస్యంగా నమోదయ్యే బర్త్, డెత్ సర్టిఫికెట్లపై కఠిన నిబంధనలు తీసుకొస్తూ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (సవరణ) బిల్లు–2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా అమల్లోకి వస్తే జననం, మరణం జరిగి రెండేళ్లు దాటిన తర్వాత నమోదు , కీలక మార్పులు చేయాలంటే కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి కానుంది. ప్రస్తుతం ఇది లోక్‌సభ ఆమోదించిన బిల్లు మాత్రమే. రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి సంతకం అనంతరం చట్టంగా అమల్లోకి రానుంది.
New-Birth-Death : ప్రస్తుతం ఇలా…
ప్రస్తుతం కడప జిల్లాలో ఆసుపత్రిలో శిశువు జన్మించిన వెంటనే బిడ్డ లింగం, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, గ్రామం తదితర వివరాలతో ఆసుపత్రి అధికారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నారు. ఆ పత్రం ఆధారంగా తల్లిదండ్రులు సంబంధిత గ్రామ , వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందుతున్నారు. అయితే సర్టిఫికెట్ పొందిన తర్వాత కొందరు శిశువు పేరు మార్చుకోవడం, స్పెల్లింగ్ సవరణలు చేయించడం, పుట్టిన తేదీ పొరపాట్లు సరిచేయించుకోవడం వంటి అవసరాలు వస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి సందర్భాల్లో సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన ఆదేశాల మేరకు బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్లు సవరణలు నమోదు చేస్తున్నారు. పరిపాలనా స్థాయిలోనే ఈ ప్రక్రియ పూర్తవుతోంది.
New-Birth-Death : కొత్త చట్టంతో మారే పరిస్థితి
కొత్త సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండేళ్లు దాటిన నమోదులు ,కీలక సవరణలు కోర్టు పర్యవేక్షణలోకి వెళ్లే అవకాశం ఉంది. సంబంధిత వ్యక్తి అఫిడవిట్‌తో పాటు అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించిన తర్వాతే నమోదు , సవరణకు అనుమతి లభిస్తుంది. దీంతో ఇప్పటి వరకు పరిపాలనా స్థాయిలో పూర్తయ్యే ప్రక్రియ భవిష్యత్తులో న్యాయపరమైన దశకు చేరే అవకాశముంది.
New-Birth-Death : ఆలస్యం చేస్తే ఖర్చు.. శ్రమ
జిల్లాలో ప్రతి సంవత్సరం వేలాది మంది జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. కొంతమంది పిల్లల పేర్లు మార్చుకోవడం, పుట్టిన తేదీ సరిచేయించుకోవడం వంటి పనులను నెలలు, సంవత్సరాలు వాయిదా వేస్తుంటారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే రెండేళ్లు దాటిన తర్వాత అలాంటి సవరణలకు కోర్టు అనుమతి అవసరం కావడంతో న్యాయవాదుల ఫీజులు, కోర్టు ప్రక్రియ, అదనపు పత్రాలు, సమయం వంటి భారాలు తప్పకపోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అందుకే పిల్లలు పుట్టిన వెంటనే జనన నమోదు చేయించడం, అవసరమైన పేర్లు, తేదీలు, ఇతర వివరాలను వెంటనే సరిచూసుకుని రెండేళ్లలోపే మార్పులు ఉంటే పూర్తి చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అదే విధంగా కుటుంబంలో మరణం సంభవించినప్పుడు కూడా ఆలస్యం చేయకుండా నమోదు చేయించడం ద్వారా భవిష్యత్తులో వారసత్వ హక్కులు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్, ఆస్తుల బదిలీ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుందని చెబుతున్నారు.
New-Birth-Death : నకిలీలకు చెక్
ఇటీవలి కాలంలో సంవత్సరాల తర్వాత తప్పుడు ఆధారాలతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్న ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను ప్రతిపాదించింది. నమోదులో పారదర్శకత పెంచడం, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టడం, డిజిటల్ రికార్డుల విశ్వసనీయతను పెంపొందించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటోంది. అలాగే పాత సి ఆర్ పి సి 1973 స్థానంలో బి ఎన్ఎస్ ఎస్ 2023 నిబంధనలకు అనుగుణంగా చట్టాన్ని సవరించనున్నారు.
New-Birth-Death : తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినవి
ప్రస్తుతం ఆసుపత్రి నుండి పొందిన సర్టిఫికెట్తో సచివాలయంలో దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లో జనన ధ్రువీకరణ పత్రం పొందవచ్చు.పేరు, తేదీ సవరణలకు రెవెన్యూ అధికారుల అనుమతి సరిపోతుంది.
New-Birth-Death : కొత్త చట్టం అమల్లోకి వస్తే
రెండేళ్లు దాటితే కోర్టుల అనుమతి అవసరం అవుతుంది.కోర్టు విచారణ తర్వాతే నమోదు , సవరణ చేయాలా అనేది డిసైడ్ అవుతుంది. తల్లిదండ్రులు, గార్డియన్స్ఆలస్యం చేస్తే సమయం, ఖర్చు, న్యాయపరమైన ప్రక్రియ తప్పదు.
