musafir cafe | సరైన వ్యక్తులు.. సరికాని సమయం.. ఇదే ‘ముసాఫిర్ కేఫ్’
musafir cafe | సరైన వ్యక్తులు.. సరికాని సమయం.. ఇదే ‘ముసాఫిర్ కేఫ్’
musafir cafe | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రతి ప్రేమకథ సంతోషకరమైన ముగింపునే కోరుకోదు. కొన్ని ప్రేమలు మనల్ని మార్చడానికి వస్తాయి, మరికొన్ని ముందుకు నడిపించడానికి వస్తాయి. అలాంటి జీవిత సత్యాలను సున్నితంగా స్పృశిస్తూ, ప్రేమ, బాధ్యత, వ్యక్తిగత ఆశయాల మధ్య జరిగే సంఘర్షణను చూపించే ప్రయత్నమే ముసాఫిర్ కేఫ్. వ్యక్తులు సరైన వారే అయినా, వారు మన జీవితంలో సరికాని సమయంలో ఎదురైతే ఏం చేయాలి? మన లక్ష్యాల కోసం ముందుకు సాగాలా? లేక ప్రేమకు ప్రాధాన్యం ఇవ్వాలా? ప్రేమ కోసం చేసుకోవాల్సిన రాజీలు, కుటుంబ బాధ్యతలు, గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ఎంచుకునే ధైర్యం వంటి అంశాలలతో ముసాఫిర్ కేఫ్ వెబ్ సిరీస్ హృద్యంగా రూపొందించారు దర్శక నిర్మాతలు.. భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టత, జీవిత నిర్ణయాలను హృద్యంగా మేళవించిన ఈ సిరీస్‌లో విక్రాంత్ మాస్సే మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ముసాఫిర్ కేఫ్ ప్రేమ, అనుబంధాలు, జీవిత నిర్ణయాల చుట్టూ తిరిగే భావోద్వేగ కథ. దివ్య ప్రకాశ్ దూబే రచించిన నవల ఆధారంగా శరణ్య రాజగోపాల్ రూపొందించిన ఈ సిరీస్‌కు రుచిర్ అరుణ్ దర్శకత్వం వహించారు. భోపాల్, ముస్సూరీ నేపథ్యంగా సాగే కథలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చందర్ (విక్రాంత్ మాస్సే), విడాకుల న్యాయవాది సుధ (వేదికా పింటో), స్వేచ్ఛగా జీవించాలని కోరుకునే ప్రీతి (మహిమా మక్వానా) జీవితాలు అనుకోకుండా ఒకదానితో మరొకటి ముడిపడతాయి.
ఎనిమిది ఎపిసోడ్‌లుగా కథను విస్తరించడంతో కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించినా, పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని లోతుగా చూపించడంలో అది ఉపయోగపడింది. కొన్ని సందర్భాల్లో ఇదే కథను రెండు గంటల సినిమాగా తెరకెక్కించి ఉంటే మరింత ప్రభావం చూపేదేమో అనిపిస్తుంది. అయినప్పటికీ సంభాషణలు, పాత్రల మధ్య కెమిస్ట్రీ, సహజమైన కథనం చివరి వరకు ఆసక్తిని నిలబెడతాయి.
విక్రాంత్ మాస్సే మరోసారి తన సహజసిద్ధమైన నటనతో చందర్ పాత్రను జీవించాడు. సందిగ్ధత, ప్రేమ, బాధ్యతల మధ్య అతని భావోద్వేగాలను ఎంతో నమ్మకంగా తెరపై ఆవిష్కరించాడు. వేదికా పింటో, మహిమా మక్వానా కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వేగంగా సాగే కమర్షియల్ కథల కంటే, జీవితంలో ప్రేమ, సమయం, నిర్ణయాల విలువను ఆలోచింపజేసే కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ముసాఫిర్ కేఫ్ మంచి ఎంపికగా నిలుస్తుంది.
