TDP మ‌హానాడులో క‌ల‌క‌లం ….సెల్​ టవర్​ ఎక్కి తెలుగు మ‌హిళ హ‌ల్ చ‌ల్

మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు
నిరాధరణకు గురవుతున్నాం
కడపలో తెలుగు మహిళ ఆగ్రహావేశం
సెల్​ టవర్​ ఎక్కి ఆత్మహత్యాయత్నం
పోలీసులు ఉరుకులు పరుగులు
పదవులు రాకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే
మహానాడుకు కూడా పిలవలేదు
దళిత వర్గాలను పార్టీకి దూరం చేసే కుట్ర
చంద్రబాబు, లోకేష్ కలవకుండా చేస్తున్నారు
తెలుగు మహిళ కడప అధ్యక్షురాలు మీనాక్షి ఆవేదన

మహానాడు (కడప బృందం), ఆంధ్రప్రభ : టీడీపీ మహానాడు సంబురాల్లో పసుపు సేన అధినేత ..సేనాధిపతి సహా పసుపుదళం మురిసిపోతుంటే..ఓ కడప వీరవనిత సెల్ టవర్ ఎక్కి ఆగ్రహావేశం వెళ్లగక్కింది. సాక్షాత్తు ఎన్టీఆర్ సెంటర్ లో ఈ నిరసన కత్రువు పోలీసులను పరుగులు పెట్టించింది. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు మహిళ కడప అధ్యక్షురాలు చిప్పగిరి మీనాక్షి బుధవారం ఉదయం ఎన్టీఆర్ సర్కిల్ లోని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కడప ఎమ్మెల్యే మాధవి తీరుతెన్నుపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుకు మీనాక్షి ఫిర్యాదు చేశారు. గతంలో కడప టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలిగా పని చేశానని, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ మీద, చంద్రబాబు, లోకేష్ నాయకత్వం మీద నమ్మకంతో, ప్రేమతో ఇన్నాళ్లు కొనసాగుతున్నాని మీనాక్షి తెలిపారు. కడప నగరంలో నిరాధరణకు గురవుతున్న కార్యకర్తల ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు.

ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు
ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత 20 ఏళ్లుగా పార్టీ పిలుపునకు స్పందించి సొంత ఖర్చులతో జనాలను తీసుకెళ్లి ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, బంద్​ల్లో పాల్గొన్నానని, అనేక పోలీసు, కోర్ట్ కేసులను ఎదుర్కొని ఆర్ధికంగా చితికిపోయాను అని మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. 2024 నుంచి పరిస్థితి మరింతగా దిగజారి పోయిందని, 2024 ఎన్నికల్లో పార్టీలో కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం కోసం చురుకుగా పనిచేసిన వందలాది కార్యకర్తలను ప్రస్తుత ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్టించుకోవటం లేదని, తమకు ఎటువంటి పదవులు రానివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా దళిత వర్గాలను పార్టీకి దూరం చేసే కుట్ర చేస్తున్నారని మీనాక్షి ఆరోపించారు.

మహానాడుకు కూడా పిలవలేదు
కనీసం మహానాడుకి పిలుపు లేదని, పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన బెట్టి పార్టీని అమ్ముకుంటున్న వారికే ఆమె అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయని మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గోడును న్నవించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యే తమను చంద్రబాబు, లోకేష్ దగ్గరకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారని మీనాక్షి ఆరోపించారు. ఇప్పటికే మాధవి రెడ్డి దురుసు ప్రవర్తన, లెక్కలేనితనాన్ని సహించలేక చాలామంది నాయకులు, కార్యకర్తలు పార్టీకి, కార్యక్రమాలకు దూరం అయ్యారని, ఈ విషయాన్ని పార్టీ పెద్దలు పట్టించుకోక పోతే భవిష్యత్తులో కడపలో పార్టీ ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తుందని మీనాక్షి ఆక్రోశం వెళ్లగక్కారు. ఆర్ధికంగా చితికిపోయినా బాధపడలేదని, ఆత్మ గౌరవాన్ని హరిస్తుంటే తట్టుకోలేక ఇలా ఆత్మహత్య చేసుకొని తెలుగుదేశం కార్యకర్తల గోడు తెలిపేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నానని మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply