Driver | బస్సు-ట్యాంకర్ ఢీ.. 16 మంది సజీవ దహనం
Driver | బస్సు-ట్యాంకర్ ఢీ.. 16 మంది సజీవ దహనం
Driver | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలోని సౌత్ సుమత్రా ప్రావిన్స్‌లో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ట్రాన్స్-సుమత్రా హైవేపై ఇంటర్‌సిటీ బస్సు, ఇంధన ట్యాంకర్ ట్రక్కు ఢీకొనడంతో 16 మంది సజీవ దహనమయ్యారు.
‘అంతర్ లింటాస్ సుమత్రా’ సంస్థకు చెందిన ప్యాసింజర్ బస్సు మే 6న నార్త్ ముసి రావాస్ రీజియన్‌లోని కరాంగ్ జయ జిల్లా పరిధిలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతతో ట్యాంకర్‌లోని ఇంధనం లీకై భారీ మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు, ట్యాంకర్ రెండూ అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ ఘటనలో 14మంది ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్, ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. మరో నలుగురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
