550 Indians | భారత గర్వంగా నిలిచిన హిఫా సలీమ్
హార్మోజ్ జలసంధిలో ఒంటరి మహిళా మెరైన్ ఇంజనీర్‌గా సాహసం.. ‘పాంచ్ సాహెబ్’గా గుర్తింపు
550 Indians | విశాఖపట్నం, ఆంధ్రప్రభ : కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా ఎడక్కళియూర్‌కు చెందిన హిఫా సలీమ్ ధైర్యసాహసాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. హార్మోజ్ జలసంధిలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చిన ఆమె కథ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
హార్మోజ్ జలసంధిలో ఇరుక్కుపోయిన 550 మంది భారతీయుల్లో హిఫా సలీమ్ కథ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె ప్రయాణించిన నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉండగా, వారిలో హిఫా ఒక్కరే మహిళా మెరైన్ ఇంజనీర్. క్షిపణుల ముప్పు మధ్య దాదాపు 100 రోజుల పాటు అప్రమత్తంగా విధులు నిర్వహించి నౌకను సురక్షితంగా గమ్యానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.
హార్మోజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక, సున్నితమైన సముద్ర మార్గాల్లో ఒకటి. అక్కడ చిన్న పొరపాటు జరిగినా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం 20 ఏళ్ల వయసులోనే హిఫా సలీమ్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి తనతో పాటు ఉన్న 23 మంది సహచర సిబ్బందికి ధైర్యం నూరిపోసింది.
ఆమె చూపిన అంకితభావం, సాహసానికి మెచ్చిన తోటి సిబ్బంది గౌరవ సూచకంగా ఆమెను ‘పాంచ్ సాహెబ్’ (ఫిఫ్త్ ఇంజనీర్) అని పిలుస్తున్నారు. ప్రస్తుతం హిఫా సలీమ్ తన తదుపరి ఉన్నత హోదా అయిన ఫోర్త్ ఇంజనీర్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.
‘ఆడపిల్లలు సముద్ర ప్రయాణాలకు, మెరైన్ రంగానికి పనికిరారు’ అనే అపనమ్మకాలను తన ఆత్మవిశ్వాసం, ధైర్యంతో చెరిపేసిన హిఫా సలీమ్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. సముద్రపు అలలను, యుద్ధ భయాలను జయించి భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ యువ మెరైన్ ఇంజనీర్‌కు ప్రతి భారతీయుడు సెల్యూట్ చేయాల్సిందే.
