మీడియాతో సమన్వయం ఉంటేనే గ్రామాభివృద్ధికి బలం..

మీడియాతో సమన్వయం ఉంటేనే గ్రామాభివృద్ధికి బలం..

సర్పంచులు, కార్యదర్శులకు సూచన

వరంగల్ జిల్లా నర్సంపేట – ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, అందుకే సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు మీడియాతో సమన్వయంగా ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నర్సంపేట నియోజకవర్గంలోని కొంతమంది కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులు మీడియా ప్రతినిధులకు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమాచారం కోసం విలేకరులు సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడం, కాల్ తిరిగి చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అయితే కొంతమంది సర్పంచులు మీడియాతో సమన్వయం పాటిస్తూ తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతున్నారని మీడియా ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరోవైపు కొందరి నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో జరుగుతున్న పనులపై ప్రజలకు సరైన సమాచారం అందడం లేదని అంటున్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మధ్య సమన్వయం లోపిస్తే నష్టం గ్రామ ప్రజలకే జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీడియా ద్వారా వెలుగులోకి వస్తే అధికారుల దృష్టికి త్వరగా చేరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, మీడియా పట్ల గౌరవం చూపే నాయకత్వానికే భవిష్యత్తులో ఆదరణ ఉంటుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేవలం సర్పంచులు మాత్రమే కాకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా సమాచార పరంగా మీడియాతో అనుసంధానంగా ఉండాలని సూచనలు వస్తున్నాయి. గ్రామ సమావేశాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను సమయానుకూలంగా అందిస్తే గ్రామానికి మంచి గుర్తింపు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మీడియా ప్రతినిధులు గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సమాచారం ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తారని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సర్పంచులు, కార్యదర్శులు, మీడియా పరస్పర అవగాహనతో కలిసి పనిచేస్తే గ్రామాభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని సూచిస్తున్నారు.