పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు

రాంపూర్‌లో ప్రత్యేక పూజలు..

అన్ని మతాల ప్రజల ప్రార్థనలు ఫలించాలని ఆకాంక్ష

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని తిరిగి ప్రజాసేవలోకి రావాలని కోరుతూ నర్సంపేట మండలంలోని రాంపూర్ గ్రామ మహిళలు సోమవారం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కోటి దేవతలను ప్రార్థించారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరుపై ప్రత్యేక అర్చనలు నిర్వహించి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, తిరిగి నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఆలయంలో భక్తిపూర్వక వాతావరణంలో జరిగిన పూజలు గ్రామ ప్రజలను భావోద్వేగానికి గురిచేశాయి.

ఈ సందర్భంగా గుజ్జ భారతి మాట్లాడుతూ, పెద్ది కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందకుండా గుండె ధైర్యంతో ఉండాలని కోరారు. వారు ఎంత ధైర్యంగా ఉంటే ప్రజలు కూడా అంతే ధైర్యంగా ఉంటారని, ఈ క్లిష్ట సమయంలో నర్సంపేట ప్రజలందరూ వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నారని అన్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలిసిన క్షణం నుంచే నర్సంపేట నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని ఆమె పేర్కొన్నారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా, ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తెలంగాణ ఉద్యమ నాయకుడని కొనియాడారు.

చిన్న స్థాయి నుంచి కష్టపడి రాజకీయంగా ఎదిగి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని రాంపూర్ గ్రామంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రజలందరూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకోవడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ముస్లిం మసీదుల్లో దువాలు, క్రైస్తవ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా తిరిగి రావాలని అన్ని వర్గాల ప్రజలు భగవంతుడిని వేడుకుంటున్నారని తెలిపారు.

నియోజకవర్గ ప్రజల ప్రేమ, అభిమానాలు, ఆశీర్వాదాలు ఆయనకు తోడుగా నిలిచి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజల మధ్యకు రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారని మహిళలు తెలిపారు. అలాగే పెద్ది కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, “మీరు ఒంటరివారు కాదు.. నర్సంపేట నియోజకవర్గం మొత్తం మీ వెంటే ఉంది” అని పేర్కొన్నారు.