మత సామరస్యంతో జీవించాలి

మత సామరస్యంతో జీవించాలి
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : ప్రతి ఒక్కరూ మత భేదాలు లేకుండా పరస్పరం గౌరవించుకుంటూ సామరస్యంతో జీవించాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సి.ఆర్ నగర్ బాంబులగడ్డ ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ ఉపవాస దీక్షలో, అలాగే గణపురం మండలం చెల్పూర్ గ్రామ ఈద్గా వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు వారి ఆధ్యాత్మిక నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. పండుగల సమయంలో అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవించే సంస్కృతి సమాజానికి అవసరమని పేర్కొన్నారు. కుల, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి లాభపడే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
అలాగే మైనార్టీ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరూ విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా హాజరైన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, చెల్పూర్ సర్పంచ్ కావటి రజిత రవీందర్, కాంగ్రెస్ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
