గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
జైనూర్, ఆంధ్రప్రభ : గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు సిడం రామారావు, కినక వామన్‌రావులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి అందించిన సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. వారి సేవలను ఆదర్శంగా తీసుకుని ఇతర ఉపాధ్యాయులు కూడా అంకితభావంతో పనిచేసి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
జైనూర్ స్కూల్ కాంప్లెక్స్‌కు ఎమ్మెల్యే తొలిసారిగా రావడంతో ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను కూడా శాలువాలతో సత్కరించి, వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు, మాజీ ఎంపీటీసీ కుమ్ర భగవంతరావు, మాజీ ఎంపీపీ చెల్లె లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆత్రం శంకరరావు, నాయకులు మెస్రం అంబాజీరావు, కనక గంగారం, ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
