AP | చింతలపూడిపై మళ్లీ ఫోకస్..!
- బొగ్గు కోసం భారీ ప్రణాళికలు..
- రేచర్ల ప్రాంతంలో గతంలో వేసిన బిడ్డింగ్…
- తెరపైకి బొగ్గు కలకలం
- మూడున్నర యేళ్లు సర్వే చేసి బొగ్గుపై అన్వేషణ
- నూటఇరవై పాయింట్లలో బొగ్గు నిల్వలు కనుగొన్న వైనం
- ఎట్టకేలకు లక్ష కోట్లతో రిలయన్స్ భారీ పెట్టుబడి సమాచారం
- ప్రాజెక్టు సాకారమైతే మారనున్న జిల్లా చింతలపూడి ప్రాంత రూపు రేఖలు
- కానీ అధికారికంగా బొగ్గుపై ఇప్పటికీ భూగర్భ గనులశాఖ నుండి వెలువడని ప్రకటన
AP | చింతలపూడి జులై 31( ఆంధ్ర ప్రభ ) : అదిగో పులి… ఇదిగో పెద్ద పులి.. అన్నట్లు ఉంది చింతలపూడి ప్రాంత బొగ్గు గనులపై వస్తున్న ప్రచారాలు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా చింతలపూడి మెట్ట ప్రాంతంలో అపార బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీస్తారని పుకార్లు తప్పా స్పష్టమైన అధికారిక ప్రకటన ఇప్పటివరకు విడుదల కాలేదు.
చింతలపూడి ప్రాంతంలో ఉన్న బొగ్గు నిల్వల అంశం ఇటీవల మళ్ళీ తెరపైకి రావడంతో ఆంధ్రప్రభ కథనం…….
తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చింతలపూడి పరిసరాల్లో ఇబ్బడి ముబ్బడిగా భూమి లోపలి పొరల్లో నల్ల బంగారం (బొగ్గు) నిక్షిప్తమై ఉందని రాష్ట్ర విభజన తర్వాత అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఆశాదీపంగా బొగ్గు నిల్వలు ఉన్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం ఆశలు మళ్ళీ చిగురించాయి.
రాష్ట్రంలో చింతలపూడి ప్రాంతంలో భూమి లోపల పొరలలో అపార బొగ్గు గనులున్నాయని గతంలో కేంద్రం సాక్షాత్తు పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు బొగ్గు నిల్వలను వెలికితీసి వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో చింతలపూడి ప్రాంతంలో బొగ్గు సర్వే పనులు చేపట్టింది. అయితే కృష్ణా జిల్లా తెలుగు సోమవారం నుండి చింతలపూడి ప్రాంతంలో నామవరం, సత్తుపల్లి ప్రాంతం వరకు అపార బొగ్గు గనులున్నాయని 2015 నుండి 2018 వరకు సర్వే చేయగా 120 పాయింట్ల మేరకు ఎంఈసిఎల్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే చేసి కేంద్రానికి నివేదిక అందించింది. అందులో భాగంగా కేంద్రం చింతలపూడి మండలంలో రాఘవాపురం, శెట్టి వారిగుడెం తదితర పాయింట్ల వద్ద డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. దీనికి సంబంధించిన కేంద్రం సర్వేల్లో చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు తయారై ఉందని నివేదిక తయారు చేసింది.

అయితే కొత్తగూడెం మాదిరిగానే చింతలపూడి ప్రాంతం రేచర్ల పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిల్వలున్నాయనీ, అందులో భాగంగా వీటిని వెలికి తీస్తే రాష్ట్ర ప్రభుత్వ కష్టాలు తీరుతాయి, మరో సింగరేణిలా మారి యనబై యేళ్లు వరకు డోకాలేదని గత ప్రభుత్వం తొలుత భావించింది. భూమి లోపల 120పాయింట్లలో బొగ్గు ఏ మేరకు నిక్షిప్తమై ఉందో అని మూడున్నర యేళ్లు పాటు కేంద్రం అన్వేషణ చేసింది. దీనిపై కేంద్రం ఓ ప్రైవేట్ ఏజెన్సీ కు కాంట్రాక్ట్ అప్పగించగా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించి పూర్తి చేసింది ఏజెన్సీ. సదరు పూర్తి చేసిన నివేదికను కేంద్రానికి ఇచ్చింది.
మొత్తం మీద చింతలపూడి ప్రాంతంలో నాణ్యత గల బొగ్గు గనులు గుర్తించినా అవి చింతలపూడి ప్రాంతంలో ఏడు వందల నుండి పన్నెండు వందల మీటర్ల లోతులో ఉండడం వలన మూడేళ్ల నుండి కేంద్రం బొగ్గు వెలికి తీసేందుకు ప్రైవేట్ ఏజెన్సీల కోసం ఎన్నిసార్లు టెండర్లు ప్రకటించినా రాలేదు. కానీ ఈ సారి కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన ఈ వేలంలో రెండు బొగ్గు గనులను రిలయన్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా దేశంలోని మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏపీలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు పిలుస్తుంది.

ఇటీవలే రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయి ఈ ప్రాజెక్టు కార్యాచరణను 2029 నాటికి పూర్తిస్థాయిలో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. చింతలపూడి బ్లాకులో పన్నెండు వందల హెక్టార్లలో బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. అలాగే రేచర్ల బ్లాకులో 2,225 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయని జియాలాజికల్ సర్వేలు చెబుతున్నాయి. భూమి ఉపరితల నుంచి కనీసం 600 మీటర్లు దిగువకు వెళ్లే కొద్దీ బొగ్గునిక్షేపాలు లభిస్తాయని, దీని తవ్వటానికి అధిక ఖర్చవుతుందనే కోల్ గ్యాసిఫికేషన్ చేయాల్సి ఉంటుందని రిలయన్స్ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం.. అయితే అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ సాకారం అయితే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని విశ్లేషకుల అభిప్రాయం.
2029 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో చింతలపూడి రేచర్ల గ్రామంలో బొగ్గు నిల్వలున్నాయని, ఎప్పటికైనా ఇక్కడి ప్రాంత ప్రజల జీవన శైలికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా లేదా అసలు బొగ్గు ఎప్పుడు తీస్తారనేది స్పష్టంగా ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన రాలేదని, ప్రజల్లో బొగ్గు వెలికితీతపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని పలువురు వాపోయారు.
