టీఆర్ఎస్ జెండా పండుగతో రాజకీయ సందడి

టీఆర్ఎస్ జెండా పండుగతో రాజకీయ సందడి
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ:
నర్సంపేట నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు, యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరి జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమానికి నర్సంపేట బాధ్యులు డాక్టర్ బోడ అనిల్ కుమార్, వరంగల్ జిల్లా ఇంచార్జ్ వెంకటేశ్వర్లు రావు హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డాక్టర్ అనిల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విశేష ఆదరణ పెరుగుతోందన్నారు.
గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం అవుతుండగా యువత, రైతులు, మహిళలు, మేధావులు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవితమ్మ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని, సామాజిక తెలంగాణ లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.
ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అంశాలతో రూపొందించిన “పంచ జన్యం” పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కవితమ్మ నాయకత్వంలో పార్టీ మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిశాంత్, రాహుల్, వంశీ, బన్నీ, వినోద్, జ్ఞానదీప్, వెంకటేష్, సురేష్, డా. వీరు, మహేందర్, కిరణ్, అభిలాష్, బిచ్చ గణేష్, మధు, నరసింహ, చందు, ఓంకార్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. మహిళా నాయకులు శాంతి, ఈరమ్మ, ఐశ్వర్య, కుమారి, దీప్తి తదితరులు హాజరయ్యారు.
