ప్రయాణంలో కారుకు మంటలు.. డ్రైవర్ సురక్షితం
కుబీర్, ఆంధ్రప్రభ : కుబీర్ మండలంలోని రంజని తండా సమీపంలో ఆదివారం ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు నుంచి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. జామ్గామ్ గ్రామానికి చెందిన యాదవ్ పండరి తన షిఫ్ట్ డిజైర్ కారు (ఏపీ 25 ఎన్ 6262)లో జంగం నుంచి రంజని తండాకు వెళ్లి, అనంతరం తిరిగి జామ్గామ్కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.
ప్రయాణంలో ఉండగానే కారులో నుంచి మంటలు వస్తున్నట్లు గమనించిన ఆయన వెంటనే వాహనాన్ని నిలిపి బయటకు వచ్చారు. కొద్దిసేపటికే మంటలు కారంతా వ్యాపించడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారు విలువ సుమారు రూ.3.5 లక్షలకు పైగా ఉంటుందని యజమాని యాదవ్ పండరి తెలిపారు.
