ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
- ఇంటింటి సర్వేలో ఖచ్చితత్వం పాటించాలి
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
వలిగొండ, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామంలో ఆదివారం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, బూత్ స్థాయి అధికారుల పనితీరును పరిశీలించారు. సర్వే విధానంపై ఆరా తీశారు.
ఒక ఫారాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందని, ఒక్కో బృందానికి ఎన్ని ఇళ్లను కేటాయించారని, ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తి చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ప్రతి ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఫారాన్ని అత్యంత జాగ్రత్తగా, పూర్తిస్థాయిలో నింపాలని ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియలో ఖచ్చితత్వం పాటించాలని, ప్రతి ఇంటిని తప్పకుండా సందర్శించి అర్హుల వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పారదర్శకంగా నిబంధనల ప్రకారం సర్వేను పూర్తి చేయాలనిఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దశరథ నాయక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
