బెల్లంపల్లి ఎమ్మెల్యే సీటు మాదిగలకే కేటాయించాలి: ఎంఆర్‌పీఎస్

2028 ఎన్నికల్లో అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి.. కరపత్రాల విడుదల

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : వచ్చే 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బెల్లంపల్లి (ఎస్సీ) రిజర్వు నియోజకవర్గం నుంచి మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ఎంఆర్‌పీఎస్ పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఆదివారం బెల్లంపల్లిలో ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలు, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా రామగిరి మహేష్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బెల్లంపల్లి నియోజకవర్గం వరకు మాదిగల ఓట్ల శాతం గణనీయంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క మాదిగ నాయకుడికీ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని అన్నారు.

తరతరాలుగా కులవృత్తులతో సమాజానికి సేవ చేస్తున్న మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం ఎందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. ఆర్థిక, రాజకీయ బలం లేదనే కారణంతో మాదిగలను వెనక్కి నెట్టడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈసారి బెల్లంపల్లి సీటును మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలోని అగ్రవర్ణాలు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు, క్రైస్తవులతో పాటు మాల, నేతకాని తదితర వర్గాల మేధావులు, విద్యావంతులు మాదిగ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. మాదిగలకు అవకాశం కల్పించడం ద్వారా ఒక వర్గానికి ఆత్మగౌరవంతో పాటు రాజకీయ గుర్తింపు లభిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్, నాయకులు రత్నం ఐలయ్య, చంద్రశేఖర్, కుమ్మరి శ్రీను, గద్దల ధర్మేందర్, పుల్లూరి రాము, రేణిగుంట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.