ప్రజాసమస్యల పరిష్కారమే ప్రజాదర్బారు లక్ష్యం

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రజాదర్బారు లక్ష్యం

గొల్లపూడిలో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: ప్రజాసమస్యల పరిష్కారమే ప్రజాదర్బారు ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అర్జీలు సమర్పించారు. వివిధ సమస్యలపై వినతులు అందాయి.

ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సత్వర పరిష్కారం సాధ్యమైన సమస్యలపై అక్కడికక్కడే స్పందించారు. మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని సిబ్బందికి సూచించారు.

కూటమి ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా సేవలందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లడంలో భాగంగానే ప్రజాదర్బారు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply