పర్యావరణ పరిరక్షణకు రైల్వే వినూత్న ముందడుగు

పర్యావరణ పరిరక్షణకు రైల్వే వినూత్న ముందడుగు

‘ఎక్ పెడ్ మా కే నామ్’ పేరిట భారీ మొక్కల నాటే కార్యక్రమం

తల్లిపేరుతో చెట్టు నాటాలని ప్రజలకు డీఆర్‌ఎం మొహిత్ సోనాకియా పిలుపు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పర్యావరణ పరిరక్షణ దిశగా విశేష కార్యక్రమాలను చేపట్టింది. మే 15 నుంచి జూన్ 5 వరకు నిర్వహిస్తున్న “వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే క్యాంపెయిన్”లో భాగంగా బుధవారం విజయవాడ వాంబే కాలనీలో భారీ స్థాయిలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు.

దేశవ్యాప్తంగా చేపట్టిన “ఎక్ పెడ్ మా కే నామ్” కార్యక్రమం కింద నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తల్లి పేరుతో ఒక చెట్టు నాటి ప్రకృతిని సంరక్షించాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. పర్యావరణ బాధ్యతను మాతృత్వంతో అనుసంధానం చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మొహిత్ సోనాకియా స్వయంగా పాల్గొని స్థానిక జాతుల మొక్కలను నాటారు. అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్లు పి.ఇ. ఎడ్విన్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), శ్రీనివాసరావు కొండా (ఆపరేషన్స్)తో పాటు శాఖాధికారులు, రైల్వే సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఆర్‌ఎం మొహిత్ సోనాకియా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు, గాలి నాణ్యతను మెరుగుపర్చేందుకు సుస్థిర అర్బన్ ఫారెస్ట్రీ అత్యవసరమని పేర్కొన్నారు. “ఎక్ పెడ్ మా కే నామ్” కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి మొక్కను తల్లి ప్రేమతో సంరక్షించే బాధ్యతగా భావించాలని ఆయన అన్నారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రించడం, పర్యావరణహిత జీవనశైలిపై అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (హెచ్‌ఎం) ఎం. వంశీకాంత్ బృందాన్ని డీఆర్‌ఎం అభినందించారు.

మొక్కల నాటకం, వ్యర్థాల నిర్వహణ అవగాహన, ఇంధన పొదుపు కార్యక్రమాల ద్వారా విజయవాడ రైల్వే డివిజన్ పర్యావరణహిత అభివృద్ధి దిశగా కట్టుబడి పనిచేస్తోందని అధికారులు తెలిపారు. ప్రజలు, రైల్వే ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా విజయవాడ డివిజన్ ముందంజలో ఉందని పేర్కొన్నారు.

Leave a Reply