Assembly – రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం …

బిసి రిజ‌ర్వేష‌న్ ల‌పై చ‌ర్చ‌
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ నివేదిక‌పైనా డిబేట్
ముందుగా రేవంత్ కేబినెట్ స‌మావేశం
ఇంటింటి కులగణన సర్వే కు ఆమోద ముద్ర వేసే అవ‌కాశం

హైదరాబాద్ ‍: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు శాసనసభ, మండలి రేపు ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది.

సమగ్ర ఇంటింటి సర్వే పేరిట కులాల వారీగా ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సర్వే నిర్వహించిన ప్రణాళికా విభాగం.. సంబంధిత నివేదికను ఇప్ప‌టికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిషన్‌ కూడా ఉత్తమ్‌ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘానికి సోమవారం నివేదిక ఇవ్వనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై విశ్రాంత అధికారి బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్‌ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై సమీక్షించనున్నారు. ఈ అంశాల‌పై రేపు మండ‌లి, శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించ‌నున్నారు.

17న రాష్ట్ర బడ్జెట్ ?

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 15 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున గవర్నర్‌ ప్రసంగం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అనంతరం 17న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఒకట్రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించి, సభను వాయిదా వేస్తారని, పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వంటివాటిని మార్చి రెండో వారంలో చేపడతారని తెలిసింది.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందని చెప్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇదే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ఒక రోజు ముందుగాని, వెనుక గాని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *