Nano Urea | యూరియా కొరతపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి

Nano Urea | యూరియా కొరతపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి

Nano Urea | రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు సరఫరా చేయని కేంద్రం
పెరుగుతున్న సాగు విస్తీర్ణంతో అధికమవుతున్న డిమాండ్
నానో యూరియాపై రైతులకు అవగాహన కార్యక్రమాలు
గ్రామ స్థాయిలో ఏఈవోల ప్రచార యత్నాలు
ఖరీఫ్‌లో ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగం

Nano Urea | హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. నానో యూరియా వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించేలా చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అమలుకు శ్రీకారం చుడుతోంది.

సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో సుమారు 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేసి కేంద్రానికి నివేదించింది. కేంద్రం కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరాకే అంగీకరించడం రైతాంగంలో ఆందోళనకు కారణమవుతోంది.

తీరా దానిని కూడా సకాలంలో అందించకపోవడంతో పరిస్థితి మరింత సమస్యగా మారుతోంది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి 1.53 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందగా, మే నెలలో కేవలం 51 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే చేరాయి. ఈ రెండు నెలల్లో కలిపి దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉండగా, సగం కూడా అందలేదు. మే నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఉండాల్సిన 3.80 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ లక్ష్యం చేరుకోవడం కష్టసాధ్యంగా మారింది.

పెరగనున్న సాగు విస్తీర్ణం

ఈ ఏడాది రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 131 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. తదనుగుణంగా యూరియా అవసరం కూడా అధికమవుతోంది.

ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) గ్రామాల్లో రైతు వేదికలు, అవగాహన సదస్సులు, క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమాల ద్వారా నానో యూరియా వినియోగ విధానం, ప్రయోజనాలను వివరించనున్నారు. పంటలకు అవసరమైన నత్రజని పోషకాలను సమర్థవంతంగా అందించడంలో నానో యూరియా ఉపయోగకరమని, తక్కువ పరిమాణంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని రైతులకు తెలియజేయనున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నానో యూరియా ప్రచార కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.