Summer Impact on Animals | ఎండల ప్రభావంతో పశువుల అవస్థలు

Summer Impact on Animals | ఎండల ప్రభావంతో పశువుల అవస్థలు

Summer Impact on Animals | అడుగంటిన నీటి కుంటలు.. ఎండిపోయిన పశుగ్రాసం
తగ్గిపోతున్న పశుపెంపకం, మారుతున్న గ్రామీణ జీవనం
అటకెక్కిన సబ్సిడీ పశుగ్రాసం పథకం
పశుపోషకుల డిమాండ్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం
వేసవిలో పశు సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Summer Impact on Animals | ఇల్లెందు, ఆంధ్రప్రభ : ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇటు మానవాళిని ఎంతగా ఇబ్బంది పెడుతోందో… పశువులను కూడా అంతే అల్లాడిస్తున్నాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే పశుగ్రాసం ఎండిపోవడంతో ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు నీటి కుంటలు ఒట్టిపోవడంతో మూగజీవాల దాహార్తిని తీర్చడంలో విఫలమవుతున్నాయి.

ఒకప్పుడు పశు యజమానులు తమ పశువులను ఎండాకాలంలో సాకేందుకు పండించే వరి గడ్డి, జొన్న చొప్పు, కంది పొట్టు నిల్వ చేసుకొని వేసవిలో ఉదయం, సాయంత్రం దాణాగా అందించేవారు. నీళ్ల కోసం ప్రత్యేక తొట్టెలు ఏర్పాటు చేసేవారు. కాలంతో పాటు పశుసంపద కూడా కరిగిపోయింది.

వ్యవసాయానికి యంత్రాల వినియోగం పెరగడంతో పశుపెంపకం తగ్గిపోయింది. కల్లాల్ల నుంచే పంటను విక్రయిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల మేతను ఇంటికి తెచ్చి దాచుకునే అలవాటు మారిపోయింది. ఈ కారణంగా అక్కడక్కడ కొంతమంది సాకుతున్న పశువులు ఎండాకాలంలో పచ్చిక ఎండిపోయి, నీటి కుంటలు అడుగంటిపోవడంతో మేత, నీళ్లు కరువై అవస్థలు పడుతున్నాయి.

అటకెక్కిన సబ్సిడీ పశుగ్రాసం పథకం

పశు యజమానులే కాదు… ప్రభుత్వాలు కూడా మూగజీవుల పట్ల వివక్ష చూపుతున్నాయి. పశువుల కోసం దాణా నిల్వ చేసుకోమని చెప్పడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. వేసవికాలంలో పశు పోషణ కోసం సబ్సిడీపై పశు దాణా పంపిణీ చేసే ఆనవాయితీ కొన్నేళ్లుగా కొనసాగుతుండేది. ఇటీవల ఈ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. పశు వైద్యశాల ద్వారా పశుగ్రాసాన్ని రైతులకు సగం ధరకే అందించే ప్రక్రియ పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఎండాకాలంలో పశుపోషణ కష్టసాధ్యంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసం అందించాలని పశు పోషకులు డిమాండ్ చేస్తున్నారు.

వేసవిలో పశు సంరక్షణలో జాగ్రత్తలు అవసరం

వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులు పశువులకు ప్రతికూలంగా మారుతాయి. ఈ పరిస్థితుల్లో పశువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో అవసరం. ఆవుల కంటే గేదెలు ఎక్కువ ఉష్ణతాపానికి గురవుతాయి. గేదెలు శరీరం నలుపు రంగులో ఉండటం, శరీరం కింద కొవ్వు భాగం ఎక్కువగా ఉండటం కారణంగా స్వేద గ్రంథుల సంఖ్య తక్కువ కావడంతో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. గేదెల శరీరాన్ని ఎప్పటికప్పుడు నీటితో చల్లబర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాలిలో తేమ అధికమైనప్పుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు లోనవుతాయి. పశువులను గాలి ప్రసరణ సరిగ్గా లేని ప్రాంతాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ పశువులను కిక్కిరిసి ఉంచడం సరికాదు. అందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

Leave a Reply