క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి
క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి
హోంగార్డులకు ప్రమాద బీమా, ఆరోగ్య భద్రతపై అవగాహన కార్యక్రమం
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో హోంగార్డుల పెరేడ్, దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని హోంగార్డులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హోంగార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ హోంగార్డుల కవాతును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ప్రతి సంవత్సరం హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రతి హోంగార్డు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి ప్రయోజనాలు, ఆరోగ్య భద్రత కోసం బీమా ప్రాముఖ్యతపై యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు అవగాహన కల్పించారు.
హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమాండెంట్ సూచించారు. తమ సేవల ద్వారా నంద్యాల జిల్లాకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ బి. చిన్ని కృష్ణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, హోంగార్డ్ డీఎస్పీ ప్రసాద్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు బాబు, విజయ్, ఆర్‌ఎస్‌ఐ హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
