1,137Meters | మేఘాలను తాకే కొండలు.. పక్షుల కిలకిలలు
1,137Meters | మేఘాలను తాకే కొండలు.. పక్షుల కిలకిలలు
1,137Meters | పచ్చని పరవళ్ల మధ్య స్వర్గధామం..
కుక్రూ-ఖామ్లా అందాలకు ఫిదా అవుతున్న టూరిస్టులు
సత్పురా ఒడిలో సహజ సౌందర్యం..
ప్రకృతి ప్రేమికులకు బెస్ట్ డెస్టినేషన్
జలపాతాలు, కాఫీ తోటలు, విండ్‌మిల్స్.. ఒకేచోట ప్రకృతి విందు
1,137Meters | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: నగర జీవన పరుగులు, కాలుష్య వాతావరణం నుంచి కాసేపు దూరంగా వెళ్లి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి మధ్యప్రదేశ్‌లోని కుక్రూ-ఖామ్లా అడవులు అద్భుతమైన గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. సత్పురా పర్వత శ్రేణుల మధ్య విస్తరించిన ఈ ప్రాంతం సహజ సౌందర్యం, పచ్చని అడవులు, మేఘాలను తాకే కొండలతో పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ప్రాంతానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో ఉన్న కుక్రూ-ఖామ్లా ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 1,137 మీటర్ల ఎత్తులో ఉంది. రాష్ట్రంలో పెద్దగా ప్రచారంలో లేని ఈ హిల్ స్టేషన్‌ను ‘హిడెన్ జెమ్ ఆఫ్ మధ్యప్రదేశ్’గా పర్యాటకులు అభివర్ణిస్తున్నారు. దట్టమైన అడవులు, మబ్బులతో కప్పుకున్న కొండలు, చల్లటి వాతావరణం ఈ ప్రాంత ప్రత్యేకత. ఈ ప్రాంతంలో కొండ శిఖరాలపై నుంచి కనిపించే సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యాలు పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి. ఉదయపు మంచు తెరల మధ్య సూర్యుడు మెల్లగా పైకి రావడం, సాయంత్రం ఎర్రటి కిరణాలతో కొండల వెనుక అస్తమించడం ప్రకృతి ప్రేమికులను మైమరపింపజేస్తుంది.

కుక్రూ-ఖామ్లా ప్రాంతంలో బ్రిటిష్ పాలన కాలం నాటి కాఫీ తోటలు ఇప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పచ్చని చెట్ల మధ్య విస్తరించిన ఈ తోటలు సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. మరోవైపు పర్వత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పవన విద్యుత్ కేంద్రాలు (విండ్ మిల్స్) ప్రకృతి అందాలకు ఆధునికతను జోడిస్తున్నాయి. వర్షాకాలం వచ్చేసరికి ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. కొండల మధ్య నుంచి జాలువారే సహజ నీటి ధారలు, చిన్న చిన్న జలపాతాలు, పచ్చటి లోయలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రకృతి ఫొటోగ్రఫీకి ఇది అత్యుత్తమ ప్రదేశంగా గుర్తింపు పొందుతోంది.

పర్యాటకులను ఆకర్షించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అడ్వెంచర్ టూరిజానికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్ వంటి కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో యువత, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. అనేక రకాల అరుదైన పక్షులకు ఈ అడవులు నిలయంగా ఉన్నాయి. పక్షుల కిలకిలరావాలు, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్ద ప్రకృతి వాతావరణం సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ప్రకృతి, సాహసయాత్రలు, ప్రశాంతత ఒకేచోట ఆస్వాదించాలనుకునే వారికి కుక్రూ-ఖామ్లా అడవులు తప్పక సందర్శించాల్సిన పర్యాటక గమ్యస్థానంగా నిలుస్తున్నాయి.
