Mahanandi | ప‌లు అభివృద్ధి కార్యక్రమాల‌కు మంత్రుల‌ శంకుస్థాప‌న‌లు

ఆంధ్రప్రభ…నంద్యాల బ్యూరో, జూన్ 9 : రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా వచ్చిన భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలను విడుదల చేశారని రాష్ట్ర మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy), రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ (NMD Farooq), శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి (Budda Rajasekhar Reddy) లు పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంకు రూ.17.50 కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిదులు విడుదల చేశామని తెలిపారు.

దేవస్థానం పరిధిలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. మహానంది (Mahanandi) లో నిర్మించిన పలు వసతి, డార్మెంటరీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి మహానంది దేవస్థానం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.10కోట్లతో నిర్మించనున్న దేవాదాయ శాఖ 50వసతి గృహాల సముదాయానికి భూమిపూజ చేశారు. మహానందీశ్వర దేవస్థానంకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మంజూరు చేసిన రూ.3.60 కోట్లతో మొదటి దశ రూ.1.60 కోట్లతో నిర్మించిన డార్మెటరీని ప్రారంభించారు.

మిగిలిన రూ.2కోట్లతో డార్మెటరీ పైన వసతి గదిలో నిర్మిస్తామన్నారు. మహానంది మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో మహానందీశ్వర స్వామి దేవస్థానం దత్తత తీసుకొన్న కాశీ విశ్వేశ్వర స్వామి (Kashi Vishweshwara Swamy) ఆలయ పునర్నిర్మాణానికి రూ.1 కోటి రూపాయలతో పున:నిర్మాణ పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం మహానందిలోని దేవాలయంలో కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply