యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం
యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం
రైతులు నేరుగా మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశం
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : రైతులకు యూరియా పంపిణీలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు ఎరువుల కోసం పడే ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యూరియా బుకింగ్ యాప్‌ను నాగర్‌కర్నూల్ జిల్లాలో గురువారం ప్రారంభించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ యాప్‌ను ప్రారంభించారు. జిల్లాలోని 20 మండలాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు యాప్ వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులకు సూచించారు. యాప్ ప్రారంభ దశలో సాంకేతిక సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే యూరియా నిల్వలను సిద్ధం చేసిందని, రైతులకు కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో సుమారు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యాప్ ద్వారా రైతులు ముందుగానే యూరియాను బుక్ చేసుకోవచ్చని, దీంతో డీలర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. యాప్ ఆధారంగా పంపిణీ చేపట్టడం వల్ల పారదర్శకత పెరగడంతో పాటు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, జిల్లా సహకార అధికారి రఘునాథ్ రావు, ఇతర అధికారులు, డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
