అయ్యప్ప డెవలపర్స్‌కు గ్రామపంచాయతీ నోటీసు
అయ్యప్ప డెవలపర్స్‌కు గ్రామపంచాయతీ నోటీసు
అనుమతులపై ఫిర్యాదులు..
మూడు రోజుల్లో పత్రాలు సమర్పించాలని ఆదేశం
అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లింగోటం గ్రామపంచాయతీ పరిధిలోని పల్కపల్లి రోడ్డులో అభివృద్ధి చేస్తున్న శ్రీ అయ్యప్ప డెవలపర్స్, శ్రీ అయ్యప్ప కాలనీ వెంచర్‌పై గ్రామపంచాయతీ చర్యలకు దిగింది. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యదర్శి అధికారికంగా నోటీసులు జారీ చేశారు.
నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందకుండా వెంచర్ నిర్వాహకులు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే పనులు నిలిపివేసి, మూడు రోజుల్లోపు అన్ని అనుమతి పత్రాలు, సంబంధిత డాక్యుమెంట్లను గ్రామపంచాయతీ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.
నిర్దేశించిన గడువులోపు వివరణ ఇవ్వకపోతే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు. నోటీసు ప్రతులను ఎంపీడీవో, ఎంపీవో కార్యాలయాలకు కూడా పంపించారు.
నోటీసులు ఇచ్చింది వాస్తవమే: కార్యదర్శి రమేష్
ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్‌ను సంప్రదించగా, లింగోటం గ్రామపంచాయతీ పరిధిలోని అయ్యప్ప డెవలపర్స్‌కు నోటీసులు జారీ చేసిన విషయం వాస్తవమేనని తెలిపారు. గత కొన్ని రోజులుగా వెంచర్‌కు సంబంధించిన అనుమతులపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.
సంబంధిత పత్రాలు సమర్పించాలని పలుమార్లు కోరినా నిర్వాహకులు కాలయాపన చేస్తున్నందున నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా వెంచర్‌కు సంబంధించిన అనుమతి పత్రాలు గ్రామపంచాయతీ కార్యాలయంలో కూడా అందుబాటులో లేవని వెల్లడించారు. దీంతో వెంచర్ చట్టబద్ధతపై స్థానికంగా చర్చ సాగుతోంది.
