కడపలో ఏపీఎల్ జోష్..
కడపలో ఏపీఎల్ జోష్..
నేడు డబుల్ హెడర్
తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్–రాయల్స్ ఆఫ్ రాయలసీమ పోరు
రాత్రి క్యాపిటల్ అమరావతి రాయల్స్–సింహాద్రి వైజాగ్ లయన్స్ పోటీ
మధ్యాహ్నం 2 గంటలకు, రాత్రి 7 గంటలకు మ్యాచ్‌లు
వైఎస్ రాజారెడ్డి స్టేడియానికి పోటెత్తుతున్న క్రికెట్ అభిమానులు
సంగీత విభావరిలో అలరించనున్న కృష్ణ చైతన్య ఇన్ఫ్యూషన్ బ్యాండ్
కడప, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్ రెండో రోజు కడపలో క్రికెట్ సందడి మరింత ఊపందుకుంది. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా గురువారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. లీగ్ రెండో దశ పోటీలకు కడప ఆతిథ్యం ఇస్తుండగా, తొలి రోజు నుంచే స్టేడియానికి భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారు. నేటి తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ జట్టు రాయల్స్ ఆఫ్ రాయలసీమతో తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అనంతరం రాత్రి 7 గంటలకు జరిగే రెండో మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు కూడా టోర్నీలో కీలకంగా మారనున్నాయి.
ఐపీఎల్ కు పెరుగుతున్న ఆదరణ…
ఏపీఎల్‌కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ కడపలో స్పష్టంగా కనిపిస్తోంది. స్టేడియంలో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ముందుగానే చేరుకుంటూ క్యూ కడుతున్నారు. క్రికెట్‌తో పాటు వినోదాన్ని అందించేందుకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
ప్రత్యేక సంగీత విభావరి..
నేటి మ్యాచ్‌ల సందర్భంగా ప్రముఖ సంగీత బృందం కృష్ణ చైతన్య ఇన్ఫ్యూషన్ బ్యాండ్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది. తమ సంగీత గానాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఈ బృందం ప్రదర్శన మ్యాచ్‌లకు మరింత ఆకర్షణగా నిలవనుంది. క్రికెట్, వినోదం, అభిమానుల హోరాహోరీ సందడితో కడపలో ఏపీఎల్ ఉత్సవ వాతావరణం నెలకొంది. స్టేడియం మరోసారి ప్రేక్షకుల కేరింతలతో మార్మోగేందుకు సిద్ధమైంది.
