Mystery Death | కావేరి న‌దిలో నీలి విప్ల‌వ శాస్త్ర‌వేత్త సుబ్బ‌న్న‌ మృత‌దేహం

ఈ నెల ఏడో తేదిన మిస్సింగ్
ముమ్మురంగా క‌ర్నాట‌క పోలీసులు గాలింపు
నేడు శ్రీరంగ‌ప‌ట్నం కావేరి న‌దిలో మృత దేహం ల‌భ్యం

బెంగ‌ళూరు – ప్రముఖ వ్యవసాయ, జలవనరుల శాస్త్రవేత్త, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (70) శవమై కనిపించారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం సమీపంలో కావేరీ నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, మైసూరు విశ్వేశ్వర నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో నివసిస్తున్న అయ్యప్పన్ మే 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయ్యప్పన్ ప్రతిరోజూ కావేరీ నది ఒడ్డున ఉన్న సాయిబాబా ఆశ్రమానికి ధ్యానం కోసం వెళ్లేవారని తెలిసింది. కావేరీ నది తీరాన ఆయన ద్విచక్రవాహనం నిలిపి ఉండటంతో, ఆయన నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని వెలికితీశారు.

డాక్టర్ అయ్యప్పన్ భారతదేశంలో ‘నీలి విప్లవం’ (ఆక్వాకల్చర్) విస్తరణకు విశేష కృషి చేశారు. పంటల విభాగేతర శాస్త్రవేత్త ఐకార్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తి ఆయనే. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అయ్యప్పన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *