july5th Tirumala | శిలాతోరణం వరకు క్యూలైన్లు..

శ్రీ‌వారి దర్శనానికి 20 గంటల నిరీక్షణ!
ఆదివారం కావడంతో శ్రీవారి సన్నిధికి భారీగా తరలివచ్చిన భక్తులు
హుండీకి రూ.3.93 కోట్ల ఆదాయం..
ఒక్కరోజే 90 వేల మందికి పైగా స్వామివారి దర్శనం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా జూలై నెలలో వేసవి సెలవులు ముగియడంతో రద్దీ తగ్గే పరిస్థితి కనిపించినప్పటికీ, ఈసారి మాత్రం భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. ఆదివారం కావడంతో రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో ఆలయ పరిసరాలు, మాడ వీధులు, క్యూ కాంప్లెక్సులు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఉచిత సర్వదర్శనం క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అదనపు సౌకర్యాలు కల్పిస్తూ తాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలు, భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేశారు.

ప్రస్తుతం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనం పొందేందుకు సుమారు 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వెళ్లే భక్తులకు 3 నుంచి 5 గంటల నిరీక్షణ ఉండగా, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల్లో దర్శనం పూర్తవుతోంది.

భక్తుల రద్దీకి అనుగుణంగానే శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదవుతోంది. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఆదాయం నమోదవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. రోజువారీగా లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, ప్రసాదం, వసతి, వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

శనివారం (నిన్న) ఒక్కరోజే 90,546 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 36,303 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.3.93 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తులకు మొత్తం 4.61 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.54 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాల ద్వారా 3,162 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్లు టీటీడీ వెల్లడించింది.

భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే వారు ముందుగానే ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవాలని, టీటీడీ సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో భక్తులు తగిన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణం చేయాలని సూచించారు.