మైసూర్ అధికారుల ‘మిర్రర్ ప్లాన్’ అట్టర్ ప్లాప్!

మైసూర్ అధికారుల ‘మిర్రర్ ప్లాన్’ అట్టర్ ప్లాప్!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: అద్దం అబద్దం చెప్పదు అంటారు. కానీ ఇక్కడ ఆ అద్దమే అధికారులకు షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, అధికారులు ఎన్ని వినూత్న ప్రయోగాలు చేసినా.. కొందరిలో మాత్రం సామాజిక స్పృహ అస్సలు మారదు అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. బహిరంగ మూత్ర విసర్జనను అరికట్టడానికి మైసూర్ అధికారులు వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఏమిటా ‘అద్దాల ప్లాన్’?
కర్ణాటకలోని మైసూర్ సబర్బన్ బస్టాండ్ గోడల వద్ద బహిరంగ మూత్ర విసర్జన పెద్ద సమస్యగా మారింది. ఎన్ని హెచ్చరిక బోర్డులు పెట్టినా, జరిమానాలు విధించినా పరిస్థితి మారలేదు. దీంతో అధికారులు ఒక వినూత్న ఆలోచన చేశారు. ఆ గోడలకు పెద్ద పెద్ద స్టీల్ అద్దాలను (Mirrors) అమర్చారు. ఎవరైనా అక్కడ మూత్ర విసర్జన చేయడానికి ప్రయత్నించినప్పుడు, అద్దంలో వారి ప్రతిబింబం వారికే కనిపిస్తుంది. తమను తాము అలా చూసుకున్నప్పుడు సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోతారని అధికారులు భావించారు. కానీ అధికారులకే ట్విస్ట్ తగిలింది.

సీన్ రివర్స్ అయ్యింది..
అధికారుల ఆలోచన వినడానికి చాలా బాగుందని మొదట్లో అందరూ ప్రశంసించారు. అద్దలు ఏర్పాటు మంచి విషయం అంటూ.. సామాజిక మాధ్యమంలో చర్చ కూడా జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో సీన్ చూస్తే అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. జనం సిగ్గుపడటం పక్కన పెట్టి.. ఆ అద్దాల ముందే నిలబడి నిశ్చింతగా పని కానిచ్చేస్తున్నారు. తాజా ఫోటోలో ఒక వ్యక్తి అద్దంలో తనను తాను చూసుకుంటూ మరీ మూత్ర విసర్జన చేయడం కనిపిస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు “వీళ్లు మారరు రా బాబూ.. ఆ అద్దాలను చూసి ఇంకా మురిసిపోతున్నారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply