TG | గవర్నర్ తో మంత్రి పొంగులేటి భేటీ..

హైద‌రాబాద్ : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ ఏడాది ప్రతినియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. గవర్నర్ ఆలోచన, సీఎం సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా 500-700 ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు పదివేల ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను రాజ్ భవన్ లో మంత్రి పొంగులేటి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూభారతి చట్టం అమలును గవర్నర్ కు వివరించారు.

మొదటి దశలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతా క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేపట్టామని గవర్నర్ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట, గొగులపూడి, ఆదిలాబాద్ జిల్లా భుర్కి, మంగ్లీ, నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్, బౌరౌపూర్ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లుగా నెల‌కొన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ కు వివరించారు. భూ భారతి చట్టాన్ని గత 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నామని ఈ నెల 5వ తేదీ నుంచి 28 మండలాల్లో అమలు చేస్తున్నామని గవర్నర్ కు తెలిపారు. ఎలాంటి రుసుము లేకుండానే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *